మంత్రి ఆదేశాలున్నా.. 17 ఎకరాల భూముల లెక్క తేలేదెప్పుడు?
* నల్లెల్ల భూదాన్ భూములపై అంతులేని జాప్యం..
* మట్టి తవ్వకాల ఆరోపణలపై మౌనం ఎందుకు?
– రాజకీయ ఒత్తిళ్లకు విచారణ నిలిచిపోయిందా?
– ఒక్కరోజు హడావుడికే అధికారుల తనిఖీలు పరిమితమా?
– జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని నిజాలు తేల్చాలి!
మహబూబాబాద్ జిల్లా, కురవి విశాల భారతి ప్రత్యేక కథనం
కురవి మండలం నల్లెల్లలో భూదాన్ ట్రస్ట్‌కు దానం చేసినట్లు పేర్కొంటున్న 17 ఎకరాల భూముల వ్యవహారం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రెవెన్యూ మంత్రి, రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి ఈ అంశం వెళ్లినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. భూముల అసలు పరిస్థితిపై స్పష్టత ఎందుకు రావడం లేదు? విచారణకు ఆదేశాలిచ్చిన అధికారులు ఏం తేల్చారు? మట్టి తవ్వకాల ఆరోపణలపై చర్యలేవి? అన్న ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.
★రెండు సర్వే నంబర్లు.. 17 ఎకరాలు.. అసలు లెక్క ఎక్కడ?
నల్లెల్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 350లో 16 ఎకరాలు, సర్వే నంబర్ 363లో ఒక ఎకరం కలిపి మొత్తం 17 ఎకరాలను శ్రీ వెరమా జగన్నాథ్ రెడ్డి, శ్రీ వెరమా రాఘవరెడ్డి భూదాన్ ట్రస్ట్‌కు దానం చేసినట్లు రాష్ట్ర భూదాన్ ట్రస్ట్ కార్యదర్శి వెంకటేష్ వివరాలు సమర్పించినట్లు సమాచారం. ఈ భూముల హద్దులు, ప్రస్తుత స్వాధీన స్థితి, రెవెన్యూ రికార్డులపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
★సీసీఎల్ఏ, కలెక్టర్‌కు మెమో.. పురోగతి ఏది?
ఈ వ్యవహారంపై భూదాన్ ట్రస్ట్ కార్యదర్శి అక్టోబర్ 9న భూ పరిపాలన ప్రధాన కమిషనర్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మెమో సమర్పించినట్లు సమాచారం. అయినా విచారణ పురోగతిపై స్పష్టమైన వివరాలు వెలువడకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూముల సర్వే పూర్తయిందా? రికార్డులు పరిశీలించారా? విచారణ నివేదిక సిద్ధమైందా? అన్నది అధికారులు వెల్లడించాలి.
★మట్టి తవ్వకాలపై విచారణ ఏమైంది?
భూదాన్ భూముల్లో మట్టి తవ్వకాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి. తవ్వకాలకు అనుమతులున్నాయా? ఎంత మట్టిని తొలగించారు? నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? అనే అంశాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలి. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
★రాజకీయ ఒత్తిళ్లకు విచారణ అటకెక్కిందా?
స్థానిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విచారణ ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జాప్యానికి కారణాలను ఉన్నతాధికారులు పరిశీలించాలి. ఆరోపణల్లో వాస్తవాలున్నాయా లేదా అన్నది ఆధారాలతో తేల్చాలి. ప్రజాప్రయోజనాలతో ముడిపడిన భూముల పరిరక్షణలో రాజకీయ పలుకుబడికి తావుండకూడదు.
★కలెక్టర్ జోక్యం చేసుకోవాలి!
జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సర్వే నంబర్లు 350, 363లోని 17 ఎకరాల భూముల హద్దులు, హక్కులు, ప్రస్తుత స్వాధీన స్థితిని నిర్ధారించాలి. భూదాన్ ట్రస్ట్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి, మట్టి తవ్వకాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలి. విచారణలో తేలిన అంశాలను ప్రజలకు వెల్లడించాలి. మంత్రి ఆదేశాలు, రాష్ట్రస్థాయి అధికారుల దృష్టి ఉన్నా భూముల లెక్క తేలకపోవడం ఎందుకు? విచారణ ఒక్కరోజు హడావుడికే పరిమితమైందా? ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారుల బాధ్యత ఏమైంది? నల్లెల్ల భూదాన్ భూములపై మౌనం వీడి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. అక్రమాలు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
