విశాలభారతి, స్టేట్ బ్యూరో : వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యోగంలోకి చేరినప్పటి నుంచి పదవి విరమణ వరకు ప్రజా సేవకు నిరంతరం పరితపించిన ప్రజా సేవకులు. కానీ ఏడుపదుల వయసొచ్చిన కుర్చీలపై మమకారాన్నీ చంపుకోలేకపోతున్నారు. రిటైర్ అయి ఏళ్లు గడుస్తున్న శాఖలో తిష్ట వేసి రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఇన్నాళ్లు ఉద్యోగంలో వెలగబెట్టింది సరిపోక, రాజకీయ పలుకుబడితో కొలువుల్లో కొనసాగుతూ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలుగా మారారు. ప్రభుత్వాలు మారిన, ఉన్నతాధికారులు చేజరిపోయిన, వీరికున్న పలుకుబడితో కుర్చీలను పట్టుకొని వేలాడుతున్నారు. చివరకు ఇన్నాళ్లు అన్నం పెట్టిన కొలువులకే మచ్చ తెచ్చే వ్యవహారాల్లో వేలు పడుతూ ఆర్జనలో ఆరితేరి పోతున్నారు.
రిటైర్ మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సర్వసాధారణంగా ఇంటికే పరిమితమవుతారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలను తీసుకొని, ఇన్నాళ్లు ప్రజా సేవలో చేసిన మంచి పనులను తలచుకుంటూ పోస్ట్ రిటర్మెంట్ జీవితాన్ని మొదలు పెడతారు. కానీ కొందరు ఉద్యోగులు 75 ఏళ్లు దాటిన ఉద్యోగంలో కొనసాగుతూ రెండు చేతులు సంపాదిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న.. కీలక శాఖలో పనిచేస్తూ యువ ఉద్యోగులకే సవాలు విసురుతున్నారు. శరీరంలో పనిచేసే ఓపిక లేకున్నా, పాలకులను మచ్చక చేసుకుని ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండాలి కానీ వీరి కోసం కొత్త పోస్టులు పుట్టగొడుగుల పుట్టుకు వస్తాయి. లేదా ఓఎస్డీలుగానైనా చెలామణి అవుతారు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తినంత కొరిగినట్లుగా, ఏండ్లకేన్డ్లు కొలువులు కొనసాగుతూ ప్రభుత్వ ఖజానాను డ్యూటీ పేరిట లూటీ చేస్తుంటారు. లక్షలాది మంది నిరుద్యోగులు చిరుద్యోగమైనా రాకపోతుందా అని ఏండ్ల తరబడి ఎదురు చూస్తుంటే, ఈ కురువృద్ధులు మాత్రం ‘పలుకుబడి’తో కొనసాగింపులతో వారికి ఫలితం లేకుండా చేస్తున్నారు. 30 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేసిన పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్లు ఉద్యోగ విరమణ అనంతరం ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఈ తంతు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. సచివాలయంలోనూ, మంత్రుల పేషీల్లోనూ పని చేస్తున్నారు. కార్పొరేషన్లలోనూ దర్శనమిచ్చే కురువృద్ధులు ఒకరిద్దరు అనుకుంటే పొరపాటే.. ఏకంగా రెండు వేల మంది అ‘విశ్రాంతంగా’ పని చేస్తున్నారు.
కుర్చీలపై మమకారం
‘నీళ్లు.. నిధులు.. నియామకాల’ నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో నియామకాలపై తొలి నుంచీ గందరగోళమే. పాత గవర్నమెంట్ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ ప్రజా పాలన వరకు
నిరుద్యోగ యువతకు ఎలాంటి భరోసా కలగడం లేదు. లక్ష ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. యువతలో మాత్రం నిరాశా నిస్పృహలు కొనసాగుతున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగాలలో కొన‘సాగుతున్న’ కురువృదుల రెండు చేతులు సంపాదన నిరుద్యోగులను కలవరపెడుతుంది. శాఖల్లో కీలక ప్రాజెక్టుల బాధ్యతలను నిర్వర్తిస్తు, వారు మినహా మరెవరూ ఆ ప్రాజెక్టులను అమలు చేయలేరన్న అభిప్రాయాన్ని పాలకులకు కల్పించారు. నీయమాకాలలో జరిగిన అన్యాయాల, మోసాల కారణంగా ఎంతో మంది యువత ఆత్మ బలిదానం చేసుకోగా మరెంతో మంది యువత ఉపాధి లేక, పెళ్లిళ్లు కాక నిర్లిప్తమైన జీవితాన్ని గడుపుతున్నారు. 85 సంవత్సరాల ముత్తాతలు కూడా అత్యాశతో మూడు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటే ఇంక యువతకు ఉపాధి ఎలా దొరుకుతుంది, పెళ్లిళ్లు ఎలా అవుతాయి, ఆత్మ బలిదానాలు ఎలా ఆగుతాయనీ మండిపడుతున్నారు.
తిరుగేలేదు.. చెప్పేది వినేది లేదు
ఏండ్లుగా తిష్ట వేసి, శాఖలను, శాఖలోని లోపాలను జీర్ణం చేసుకున్న ఈ సీనియర్ ఉద్యోగులు ఆడింది ఆటగా పాలన వ్యవహారాలను నిర్వర్తించడం సర్వసాధారణం. కొత్త కాంట్రాక్టులు రావాలన్న, కింది స్థాయి ఉద్యోగాల్లో సిబ్బంది కొనసాగాలన్న, సీనియర్ సిటిజనులను ప్రసన్నం చేసుకుంటే గానీ అవకాశం ఇవ్వరు. వీరి మాటకు ఇక తిరుగే లేదని, చెప్పేది కూడా వినలేనంత బ్రహ్మచెవుడిగా మారిపోతారు. తొండ ముదిరి ఊసరవెల్లి మాదిరిలా మారుతూ సేవల కొనసాగుతున్నారు. ప్రభుత్వం కోట్లకు పైగా వెచ్చించి చేపట్టి ప్రాజెక్టు అమలు బాధ్యతను రిటైర్డ్ అధికారి మాత్రమే నిర్వర్తించగలడని ప్రభుత్వానికి నివేదిక సమర్పించుకుంటారు. సంస్థల్లో నుంచి ఓఎస్డీల వరకు కొనసాగుతు మంత్రుల పేషీల్లోనూ తిష్ఠ వేశారు. సీనియార్టీ పేరుతో ఆయా శాఖల ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రాజెక్టులు, పథకాలు వీరి ఆధిపత్యంలోనే నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ సీనియర్ ఐఏఎస్ కు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు లభించినా, ఆయన కంటే రిటైర్డు సీనియర్ అధికారి పెత్తనం, మాటే చెల్లుబాటయ్యిందని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు.
శిల్పారామంలో ఎనిమిది పదుల కురువృద్ధుడు.
రాష్ట్రానికి ఆదాయంతో పాటు, పరపతిని పెంచే శాఖల్లో టూరిజం ఒకటి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ఈ శాఖలోని శిల్పారామం విభాగానికి ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. కానీ ఈ శాఖను 85 ఏళ్లు దాటిన కురువృద్ధుడు నెట్టుకొస్తున్నాడు. ప్రభుత్వ అండ ఉంటె చాలు చచ్చేదాకా జాబ్ చేసుకోవచ్చనే విషయం ఇలాంటి వారిని చూస్తే అర్థం అవుతుంది. 85 సంవత్సరాల వయసులో ప్రభుత్వ అండతో 3 అతిపెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఒకపక్క పెన్షను , ఇంకో పక్క ప్రభుత్వ జీతము , మరోపక్క ప్రైవేట్ జీతము, వీటికి బోనస్ గా ప్రభుత్వ వాహనము ఇలా సకల సదుపాయాలు రాజభోగాలు ప్రభుత్వ అండతో ముక్యంగా సచివాలయంలో ఉన్న ఉన్నతాధికారి అండతో అనేక సంవత్సరాలుగా రాజభోగాలను అనుభవిస్తూనే ఉన్నాడు. తాను పక్కకు జరిగితే ఇంకో నలుగురికి ఉపాధి దొరుకుతుందనే కనీస ఇంగిత జ్ఞానం కూడా ఇతనికి గాని, ఇతన్ని కొనసాగిస్తున్న బడా అధికారికి గాని, ప్రభుత్వానికి గాని లేకపోవడం శోచనీయం. ఇతడి స్థానంలో మరో వ్యక్తిని నియమించిన, ఈ ముత్తాత, సచివాలయం ఉన్నతాధికారి కలిసి బాధ్యతలు తీసుకోకుండానే అడ్డుకున్నారనీ టూరిజం శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి. డబ్బులు లేక ప్రాజెక్ట్ లు లేక , పనులు లేక ఎంతో మంది అధికారులు ఖాళీగా కూర్చుంటున్నారు, ఇలాంటి నిజామ్ కాలం నాటి బూరుజులకు బదులు సమర్థులను వాడుకుంటే ప్రభుత్వానికి ఎంతో ఖర్చు కలిసివస్తుంది, మంచి పేరూ వస్తుంది. ఆ పని చెయ్యకుండా నిద్రపోయినట్టు నటిస్తే మాత్రం విమర్శల ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి ముత్తాతలను ఇంటికి పంపిస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది ఆత్మా బలిదానాలు చేసుకున్న వారి త్యాగానికి తగిన గౌరవం లభిస్తుంది. 25 ఏళ్ల కిందట పదవి విరమణ పొందిన ఈయన… రాజకీయ పలుకుబడితో కుర్చీలో తిష్ట వేసాడు. తరగని అధికారంపై మమకారంతో నడవలేని స్థితిలోనూ టూరిజం శాఖలో పరుగులు పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ జాబితాలో 85 ఏళ్ల కురువృద్దిడితో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. కానీ ఈ సీనియర్ సిటిజన్ పనితీరు ముందు ప్రభుత్వ ఆదేశాలు కూడా నిలువ లేకపోయాయి. తాము లేకపోతే ఆ శాఖలకు పనిచేయడమే రాదన్నట్లుగా ఆర్డర్లు తెప్పించుకొని మరి ఏండ్లుగా పట్టి వేలాడుతున్నారు.
