A place where you need to follow for what happening in world cup

- Advertisement -

వినాయక నిమజ్జనానికి శేరిలింగంపల్లి సిద్ధం!

0 43

వినాయక నిమజ్జనానికి శేరిలింగంపల్లి సిద్ధం!
– భారీస్థాయిలో జోన్ యంత్రాంగం ఏర్పాట్లు
– భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు

సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్‌లో వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలు ప్రశాంత వాతావరణంలో, పర్యావరణహితంగా జరిగేలా నర్సింగి, పటాన్ చెరు, అమీన్ పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో జోన్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.మట్టి గణపతుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు అధికారుల ఆధ్వర్యంలో 10 వేల పర్యావరణహిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్థం, నిమజ్జనం సజావుగా సాగేందుకు మొత్తం 30 ప్రాంతాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో 17 సహజ సిద్ధమైన చెరువులు, 8 బేబీ పాండ్స్, మరో 5 తాత్కాలిక కృత్రిమ కొలనులను సిద్ధం చేశారు. నిమజ్జన ప్రాంతాల వద్ద 70 మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచడమే కాకుండా, పారిశుధ్య లోపం తలెత్తకుండా షిఫ్టుల వారీగా ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని మోహరించారు. అన్ని వార్డుల్లోనూ విద్యుత్ దీపాల ఏర్పాటు పనులను ఇప్పటికే పూర్తి చేశారు.

రంగంలోకి 152 భారీ వాహనాలు, క్రేన్లు..
నిమజ్జనం వేగవంతంగా పూర్తి చేసేందుకుగాను యంత్రాంగం ఏకంగా 152 భారీ వాహనాలను రంగంలోకి దించింది. విగ్రహాల పరిమాణానికి అనుగుణంగా 18 లాంగ్ బూమ్ క్రేన్లు (30 టన్నులు), 10 స్టాటిక్ క్రేన్లు (15 టన్నులు), 24 మొబైల్ క్రేన్లతో పాటు 39 టిప్పర్లు, 25 మినీ టిప్పర్లు, 19 లాంగ్ బూమ్ ఎక్స్‌కవేటర్లు, 27 జేసీబీలను అందుబాటులో ఉంచారు.

అందుబాటులో తాగునీరు,కంట్రోల్… రూమ్‌లు..
నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అప్రోచ్ రోడ్ల మరమ్మతులు, పూడికతీత, రంగులు వేయడం, కొలనుల్లో శుభ్రమైన నీటిని నింపే పనులు పూర్తి చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తూనే, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. రవాణాకు ఆటంకం కలగకుండా రహదారులపై విద్యుత్ లైన్ల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. వేడుకలు సురక్షితంగా, ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసేలా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నట్లు శేరిలింగంపల్లి జోన్ అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.