A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కురవి భూదాన్‌ భూమి ఎవరి అదీనంలో..?

0 116

కురవి భూదాన్‌ భూమి ఎవరి అదీనంలో..?

* భూదాన్‌ భూమి కబ్జా కోరల్లోనా..? అధికారుల కనుసన్నల్లోనా?
* కురవిలో ప్రభుత్వ భూములపై కబ్జా కత్తి!
* 275 ఎకరాల 22 గుంటల భూములపై సమగ్ర విచారణకు డిమాండ్‌.
* పి.ఓ.టి., అసైన్డ్‌ భూముల అక్రమ లావాదేవీలపై కొరడా ఝుళిపించాలి.
* ఒకే అంశంపై వరుస ఫిర్యాదులు.. ఇక అధికారుల స్పందన ఎప్పుడు?

మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విశాల భారతి):

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ, సీలింగ్‌, పి.ఓ.టి., భూదాన్‌, అబాది, ప్రజాప్రయోజన భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, దైద భద్రయ్య, రాగం వీరభద్రం, దళిత నాయకులు కిన్నెర మల్లయ్య, ఇరుగు వెంకన్న, సీపీఐ నాయకులు బుడమ వెంకన్న, దూది కట్ల సారయ్య, కన్న వెంకన్నలు అధికారులకు వరుసగా ఫిర్యాదులు చేశారు.

★275 ఎకరాలపై అనుమానాలు..,
జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కురవి గ్రామ రెవెన్యూ పరిధిలో మొత్తం 275 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ, ఇతర కేటాయించిన భూములు ఉన్నట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ఇందులో అబాది 43 ఎకరాల 09 గుంటలు, సీలింగ్‌ భూములు 11 ఎకరాల 19 గుంటలు, ప్రభుత్వ భూమి 158 ఎకరాల 18 గుంటలు, పి.ఓ.టి. భూములు 57 ఎకరాల 35 గుంటలు, భూదాన్‌ భూమి 4 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, భూముల స్వభావం, విస్తీర్ణం, సర్వే నంబర్లు, ప్రస్తుత స్థితిగతులను అధికారికంగా నిర్ధారించాలని కోరారు.

★177 సర్వే నంబర్‌పై ప్రత్యేక దృష్టి.
కురవి గ్రామంలోని సర్వే నంబర్‌ 177, బై నెంబర్ల లోని ప్రభుత్వ భూములను ప్రత్యేకంగా గుర్తించి పరిరక్షించాలని పలువురు అధికారులను కోరారు. ప్రభుత్వ భూములకు క్షేత్రస్థాయిలో హద్దులు నిర్ణయించి హద్దురాళ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ధరణి రికార్డులు, పాత రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి సమగ్రంగా పరిశీలించాలని ఫిర్యాదుదారులు విజ్ఞప్తి చేశారు.

★అసైన్డ్‌ భూముల అక్రమ లావాదేవీలపై చర్యలు.
పి.ఓ.టి./అసైన్డ్‌ భూములపై అక్రమ కొనుగోళ్లు, విక్రయాలు, ఆక్రమణలు జరిగినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూముల వివరాలను ప్రజలకు బహిరంగపరచాలని, పారదర్శకంగా రికార్డులను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు.

★చెరువులు.. కుంటలపైనా కన్నేయాలి.
ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, కుంటలు, శిఖం భూములు, కాలువల ఆక్రమణలపైనా సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు. విలువైన ప్రజా ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

★విశాల భారతి కథనాలకు స్పందించిన సీపీఐ.
కురవిలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న అంశంపై ‘విశాల భారతి ’ దినపత్రికలో వరుసగా వస్తున్న కథనాలకు స్పందించిన సీపీఐ నాయకులు ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ డోర్నకల్‌ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కురవి ప్రజావాణిలో ఎంపీడీవో వీరబాబుకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి హద్దురాళ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, సర్వే నంబర్‌ 177తో పాటు అన్ని ప్రభుత్వ భూములను గుర్తించి రక్షించాలని వారు కోరారు.

★ఎస్సీ బాలికల హాస్టల్‌ మార్చాలని మరో ఫిర్యాదు.
కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహం భవన పరిస్థితులను పరిశీలించి, విద్యార్థినుల భద్రత దృష్ట్యా సురక్షితమైన భవనానికి మార్చాలని దళిత నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌కు సంబంధించి సాంకేతిక పరిశీలన చేపట్టి, విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో ప్రభుత్వ భూములను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

★ఒకే అంశంపై వరుస ఫిర్యాదులు.. ఇక అధికారుల స్పందన ఎప్పుడు?
ప్రభుత్వ భూముల పరిరక్షణ, హాస్టల్‌ తరలింపు, ఆక్రమణలపై విచారణ కోరుతూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సీపీఐ నాయకులు, దళిత నాయకులు వేర్వేరుగా ఫిర్యాదులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, దైద భద్రయ్య, రాగం వీరభద్రం, దళిత నాయకులు కిన్నెర మల్లయ్య, ఇరుగు వెంకన్న,  సీపీఐ నాయకులు బుడమ వెంకన్న, దూది కట్ల సారయ్య, కన్న వెంకన్నలు  ఫిర్యాదులు సమర్పించారు.

★సమగ్ర విచారణ చేసి నివేదికను ప్రజల ముందుంచాలి.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి కురవి గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, సీలింగ్‌, పి.ఓ.టి., భూదాన్‌, అసైన్డ్‌ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణలు ఉంటే తొలగించి, పూర్తి నివేదికను ప్రజలకు వెల్లడించాలని ఫిర్యాదుదారులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి.. వాటిని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో మరిన్ని భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.