జనగాం, విశాలభారతి: రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. యూరియా బస్తాల కోసం ఇక క్యూ లైన్లలో నిల్చునే తిప్పలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెర్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా బుకింగ్ యాప్ అమలుపై సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ముందుగానే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిందని వెల్లడించారు. రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ యాప్‌ను ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైతుల విలువైన సమయం వృధా కాకుండా ఉండేందుకు, కేవలం ఎరువుల పంపిణీ కోసం ఈ కొత్త మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నట్టు తెలిపారు. యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్ దగ్గర మాత్రమే కాకుండా, జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల దగ్గర ఉన్న యూరియా స్టాక్ లభ్యతను కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన యూరియాను తమకు అనుకూలమైన డీలర్ దగ్గర నుంచే ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్‌లో కల్పించనున్నారు.
యూరియాను బుక్ చేసిన తర్వాత రైతుకు ప్రత్యేక బుకింగ్ ఐడీ అందుతుంది. ఆ బుకింగ్ ఐడీ ఆధారంగానే డీలర్ యూరియాను విక్రయించాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో పంట పేరు, సాగు విస్తీర్ణం మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. పాస్‌బుక్ లేని రైతులు ఆధార్ ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా, కౌలు రైతులకు కూడా యాప్‌లో ప్రత్యేక సౌకర్యం కల్పించారు. హెల్ప్‌లైన్ నెంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు యూరియా బుకింగ్ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రైతులు యాప్‌ను పూర్తిగా అలవాటు చేసుకునే వరకు నిరంతరం మార్గనిర్దేశం చేయాలన్నారు. ఈ యూరియా బుకింగ్ యాప్ అమలుతో యూరియా పంపిణీలో పారదర్శకత పెరిగి, దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని, రైతులకు సమయానికి యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, జిల్లాలోని డీలర్లు, మండల వ్యవసాయ అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, జిల్లా సహకార అధికారి జిల్లా మేనేజర్ – మార్క్‌ఫెడ్ పాల్గొన్నారు.
