యెల్లమ్మబండలో దారి దోపిడీ
– ముగ్గురు అరెస్టు
– బాధితుల నుంచి బంగారు చెవి రింగులు, ప్లాటినం ఉంగరం లాక్కెళ్లిన నిందితులు
సైబరాబాద్ – విశాల భారతి
యెల్లమ్మబండలో దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.లక్ష విలువైన 4 గ్రాముల బంగారు చెవి రింగులు, ప్లాటినం ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సెప్టెంబర్ 6న రాత్రి కూకట్‌పల్లి నుంచి జీడిమెట్లకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని సిక్ బస్తీ, గురుగోవింద్‌సింగ్ కాలనీ, యెల్లమ్మబండ వద్ద ముగ్గురు అడ్డగించారు. అనంతరం వారిని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి మహిళ వద్ద ఉన్న బంగారు చెవి రింగులు, ప్లాటినం ఉంగరాన్ని బలవంతంగా లాక్కొని పరారయ్యారు.
సెప్టెంబర్ 7న బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా తిలిపిత్యా దీపక్‌సింగ్ (45), బౌరి రచన్‌సింగ్ (25), బురాని సుర్జిత్‌సింగ్ (25)లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 8న వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు దీపక్‌సింగ్‌పై గతంలో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో రాత్రివేళ ఇంటి దొంగతనం కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఏసీపీ ఏసీ బాలగంగిరెడ్డి మార్గదర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్ ఎన్.సురేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పి.నరేంద్రరెడ్డి, ఎస్సై కె.శ్రీనివాస్, క్రైమ్ సిబ్బంది కేసును ఛేదించారు.
