స్టోన్ క్రషర్లో గంజాయి కలకలం..
33 గ్రాముల గంజాయి స్వాధీనం.. ఒకరిపై కేసు నమోదు
విశాల భారతి, షాద్నగర్:
కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వేముల నర్వ గ్రామ శివారులో గంజాయి కలకలం చోటుచేసుకుంది. ఆర్కాన్ మినరల్స్ స్టోన్ క్రషర్ ప్రాంగణంలోని ఓ గదిలో గంజాయి ఉన్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి, సుమారు 33 గ్రాముల గంజాయిగా అనుమానిస్తున్న పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీ సాయంత్రం కేశంపేట పోలీసుల ఆధ్వర్యంలో షాద్నగర్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ అడ్డాకుల శ్రీకాంత్, పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్, పంచ సాక్షులతో కలిసి స్టోన్ క్రషర్ ప్రాంగణంలోని ఓ గదిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గది గోడకు వేలాడదీసిన నల్లటి కవర్లో ఎండిన ఆకులు, పువ్వుల వంటి గంజాయిగా అనుమానిస్తున్న పదార్థాన్ని గుర్తించారు.అదే గదిలో నివసిస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రామకృష్ణ పటేల్ (31) వద్ద ఈ పదార్థం లభించడంతో పంచ సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. దీని నికర బరువు సుమారు 33 గ్రాములుగా గుర్తించారు. ఈ ఘటనపై కేశంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, ఎస్ఐ బి. పరమేష్ దర్యాప్తు చేపట్టారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
గంజాయి,ఇతర మాదకద్రవ్యాల అక్రమ నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఫోటో రైటప్:గంజాయి నీ స్వాధీనం చేసుకున్న పోలీసులు..
