రాజధాని రణభేరికి సన్నాహాలు
– మియాపూర్‌లో రేపు భారీ సభ.. కవిత అధ్యక్షతన కార్యక్రమం
– ఆల్విన్ సర్కిల్ నుంచి నరేన్ గార్డెన్స్ వరకు ర్యాలీ
శేరిలింగంపల్లి – విశాల భారతి
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ‘రాజధాని రణభేరి’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన భారీ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మియాపూర్ ఆల్విన్ సర్కిల్ నుంచి నరేన్ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నరేన్ గార్డెన్స్‌లో జరిగే సభలో గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నట్లు చెప్పారు.గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు ‘రాజధాని రణభేరి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
