శేరిలింగంపల్లిలోనూ ఉప ఎన్నిక?
– దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిర్రా రవీందర్ యాదవ్ వ్యాఖ్యలు
సైబరాబాద్ – విశాల భారతి
బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కీలక పరిణామమని ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి ఈ తీర్పు గుణపాఠమని పేర్కొన్నారు.ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన తర్వాత పార్టీ మారడం ప్రజా తీర్పును అవమానించడమేనన్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ పరిణామాన్ని గమనించాలని సూచించారు.
శేరిలింగంపల్లిలోనూ ఉప ఎన్నిక ఖాయం:
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విషయంలోనూ త్వరలో అనర్హత వేటు పడుతుందని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికకు పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా పార్టీ మారిన వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల తీర్పే అంతిమమని వ్యాఖ్యానించారు.
