గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వాసిలి
– మూడు కార్పొరేషన్లలో పార్టీని గెలిపించడమే లక్ష్యం
– 2028లో కవితను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయం
సైబరాబాద్ – విశాల భారతి
తెలంగాణ రక్షణ సేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌ను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా తనను నియమించిన కవితకు వాసిలి కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే జీహెచ్ఎంసీ, సైఎంసీ, ఎంఎంసీ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వాసిలి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని చెప్పారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిని చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పేర్కొన్నారు.
