హుడా కాలనీలో చైన్ స్నాచింగ్
– వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలి మెడలోని 5.5 తులాల బంగారు గొలుసు అపహరణ
సైబరాబాద్ – విశాల భారతి
వాకింగ్‌కు వెళ్లిన 63 ఏళ్ల మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమాదేవి (63) ఉదయం సుమారు 7.40 గంటలకు తన అపార్ట్‌మెంట్ ఎదుట సీసీ రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని సుమారు 5.5 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి
– ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్
ఇళ్ల ముందు, రహదారులకు ఇరువైపులా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రతి కాలనీలోని ప్రధాన చౌరస్తాల్లో నాలుగు దిశలను కవర్ చేసేలా కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాల దర్యాప్తులో కీలక ఆధారాలు లభిస్తాయని, నిందితులను త్వరగా గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
