హెచ్‌సీయూ ఎన్నికల్లో బీఎస్ఎఫ్ అభ్యర్థిగా స్నేహ
– జనరల్ సెక్రెటరీగా గెలిపించాలని విజ్ఞప్తి
– విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి
సైబరాబాద్ – విశాల భారతి
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ పదవికి బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ తరఫున స్నేహ వంకుడోతు పోటీ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని గిరిజన గ్రామానికి చెందిన ఆమె జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యాభ్యాసం అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం హెచ్‌సీయూలో సామాజిక శాస్త్రంలో మాస్టర్స్ చేస్తున్నారు.
రిజర్వేషన్ల వల్లే తనలాంటి ఆదివాసీ, బహుజన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభించాయని, వారి హక్కుల కోసం విద్యార్థి సంఘం ద్వారా పోరాడుతానని స్నేహ పేర్కొన్నారు. బహుజనుల స్వయంప్రతిపత్తి రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.
జనరల్ సెక్రెటరీగా ఎన్నికైతే ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు మెస్, క్యాంటీన్ ధరలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలు, దివ్యాంగులు సహా అందరికీ సురక్షిత, సమ్మిళిత క్యాంపస్ కోసం పనిచేస్తామని, విద్యార్థులకు జవాబుదారీగా ఉండేలా బహిరంగ సమావేశాలు నిర్వహిస్తామని బీఎస్ఎఫ్ తెలిపింది. సెప్టెంబరు 28న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో స్నేహ వంకుడోతుకు ఓటు వేసి గెలిపించాలని విద్యార్థులను కోరింది.
