రూ.2.1 కోట్ల లావాదేవీపై గాంధీ వివరణ
– 2018లో కార్యాలయ స్థలం కోసం చెల్లించిన మొత్తమే తిరిగి వచ్చింది
– సాహితీ సంస్థ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ
సైబరాబాద్ – విశాల భారతి
సాహితీ సంస్థ నుంచి రూ.2.1 కోట్లు తమ ఖాతాలోకి వచ్చినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ వివరణ ఇచ్చారు. ఈడీ నోటీసు అంశంపై మీడియాలో కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలను గమనించాలని మీడియా మిత్రులను కోరారు.సాహితీ సంస్థ నుంచి తమకు రూ.2.1 కోట్లు వచ్చాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వాస్తవానికి ఆ మొత్తాన్ని తాము 2018లోనే కార్యాలయ స్థలం కోసం సదరు సంస్థకు తమ ఖాతా ద్వారా చెల్లించినట్లు గాంధీ తెలిపారు. అయితే కార్యాలయ స్థలాన్ని కేటాయించలేకపోవడంతో సదరు సంస్థ ఆ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాలోకి జమ చేసిందని వివరించారు.ఈ లావాదేవీకి సంబంధించిన వాస్తవాలను మీడియా దృష్టికి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సాహితీ సంస్థ కార్యకలాపాలు, ఆ సంస్థకు సంబంధించిన ఇతర వ్యవహారాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈడీ నోటీసు అంశంలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని వార్తలు ప్రచురించాలని మీడియా మిత్రులను కోరారు.
