ఓయో హోటల్ కేసులో కీలక మలుపు
– యువతి మృతి కేసు నిందితుడి ఆత్మహత్యాయత్నం
– పరవాడ పోలీసులకు చిక్కిన సమాచారం
సైబరాబాద్ – విశాల భారతి
మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. విశాఖపట్నం సమీపంలోని పరవాడ ప్రాంతంలో ఈ ఘటన జరగగా.. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రికి తరలించారు.
యువతి మృతి అనంతరం మాదాపూర్ పోలీసులకు చిక్కకుండా రవితేజ పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తుండగా.. పరవాడ పోలీసులకు అతడి జాడ లభించింది. ఈ విషయాన్ని మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. అతడి వాంగ్మూలంతో యువతి మృతికి దారితీసిన అసలు కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
