గంగారంలో రత్నదీప్‌లో కలకలం
– పురుగులు పట్టిన జ్యూసులు.. కుళ్లిన ఐస్‌క్రీములు?
– కాలం చెల్లిన ఉత్పత్తుల విక్రయంపై వినియోగదారుల ఆందోళన
– ఫుడ్ సేఫ్టీ అధికారులపై అసంతృప్తి
సైబరాబాద్ – విశాల భారతి
గంగారంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో నాసిరకం, కాలం చెల్లిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కలకలం రేగింది. పురుగులు పట్టినట్లు కనిపించిన జ్యూస్ బాటిళ్లు, దుర్వాసన వస్తున్న ఐస్‌క్రీములను విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో సూపర్ మార్కెట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు.
స్థానికుల వివరాల ప్రకారం.. సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన కొన్ని జ్యూస్ బాటిళ్లలో పురుగులు కనిపించడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. అదేవిధంగా కొన్ని ఐస్‌క్రీములు దుర్వాసన వస్తూ, నాణ్యత కోల్పోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆహార పదార్థాల నిల్వ, విక్రయాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్ని ఉత్పత్తులపై కాలం చెల్లిన తేదీలను మార్చి విక్రయిస్తున్నారనే అనుమానాలను కూడా వినియోగదారులు వ్యక్తం చేశారు.
వినియోగదారులు సూపర్ మార్కెట్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. చిన్నారులు, కుటుంబాలతో వచ్చే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే జ్యూసులు, ఐస్‌క్రీముల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసినా..
సమాచారం తెలుసుకున్న వినియోగదారులు సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని ఆరోపించారు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆహార పదార్థాల విక్రయాలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను పరిశీలించాలని కోరుతున్నారు.
తనిఖీలు చేపట్టాలని డిమాండ్..
కాలం చెల్లిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు వినియోగించే ఉత్పత్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, అనుమానిత ఉత్పత్తుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
