గోపనపల్లిలో ఒరిగిన నాలుగంతస్తుల భవనం
– కూల్చివేతకు రంగం సిద్ధం.. భారీ క్రేన్ తరలింపు
– అడ్డుకున్న యజమాని కుటుంబం
సైబరాబాద్ – విశాల భారతి
గోపనపల్లి ఎన్టీఆర్‌నగర్‌లో ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల భవనం వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సుమారు 50 గజాల స్థలంలో నిర్మించిన ఈ భవనం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం.ప్రమాద తీవ్రతను గుర్తించిన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా భవనం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం ప్రమాదకరంగా మారిన భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. ఇందుకోసం భారీ సామర్థ్యం కలిగిన క్రేన్‌ను ఘటనా స్థలానికి తరలించి కూల్చివేతకు ఏర్పాట్లు చేశారు.అయితే భవనాన్ని కూల్చివేయొద్దంటూ యజమాని కుటుంబ సభ్యులు అధికారులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో గోపనపల్లి ఎన్టీఆర్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న భవనం కారణంగా చుట్టుపక్కల నివాసితుల్లో ఆందోళన కొనసాగుతోంది.
