అక్రమ నిర్మాణాలే అడ్డా.. వసూళ్లే దందా!
– సర్కిల్-49 టౌన్ ప్లానింగ్‌పై తీవ్ర ఆరోపణలు
– టీపీఎస్ చైన్‌మెన్‌కు ‘ప్రైవేట్ సైన్యం’ అంటూ ఆ నలుగురిపై స్థానికుల ఆగ్రహం
శేరిలింగంపల్లి-విశాల భారతి
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగంలోనే కొందరి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్-49 పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకోవడం లేదని, మరోవైపు వాటిని అడ్డుపెట్టుకుని కొందరు అందినకాడికి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన టీపీఎస్ చైన్‌మెన్ చుట్టూ నలుగురు సభ్యులతో కూడిన ఓ ‘ప్రైవేట్ సైన్యం’ తిరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారిక హోదా లేకపోయినా తమకు అధికారుల అండ ఉందన్న ధీమాతో నిర్మాణదారుల వద్ద హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాల వద్ద ఎవరి పెత్తనం?
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈ నలుగురు కనిపిస్తూ నిర్మాణదారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు, నిబంధనల పేరుతో భయపెట్టి వ్యవహారాలను ‘సర్దుబాటు’ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు స్థానికులు చెబుతున్నారు.అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులు చేసినా స్పందన కనిపించడం లేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించకపోవడంతో అక్రమ నిర్మాణాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
చైన్‌మెన్ చుట్టూ ఆ నలుగురు ఎవరు?
టీపీఎస్ చైన్‌మెన్‌తో సన్నిహితంగా ఉంటున్నారని చెబుతున్న ఆ నలుగురు ఎవరు? వారికి ఏ అధికారిక బాధ్యత ఉంది? నిర్మాణదారుల వద్ద వారు ఎందుకు తిరుగుతున్నారు? వారి పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడుతున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్కిల్-49లో చర్చనీయాంశంగా మారాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహిస్తే, నిబంధనలు పాటించే ప్రజల పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణల్లో వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నతాధికారుల అలసత్వమే కారణమా?
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నా తగిన చర్యలు తీసుకోకపోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది వ్యవహారశైలిని పర్యవేక్షించకపోవడం వెనుక ఉన్నతాధికారుల అలసత్వం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించకపోతే అక్రమార్కులకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్కిల్-49లో టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.టీపీఎస్ చైన్‌మెన్ చుట్టూ తిరుగుతున్న ఆ నలుగురు ఎవరు? అక్రమ నిర్మాణాల వద్ద వారి పాత్ర ఏమిటి? వసూళ్ల ఆరోపణల్లో నిజమెంత? ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?
త్వరలో మరిన్ని పూర్తి వివరాలతో…
