సాహితి ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లు
– రూ.2.1 కోట్ల లావాదేవీలపై విచారణకు పిలుపు
– తమకు ఎలాంటి నోటీసులు అందలేదన్న పీఏ రమేష్
సైబరాబాద్ – విశాల భారతి సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. సెప్టెంబరు 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
సాహితి ఇన్‌ఫ్రా నుంచి ఎమ్మెల్యే బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీల స్వభావం, నిధుల వినియోగం, వాటికి సంబంధించిన వ్యాపార కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధులు సేకరించి మోసం చేశారన్న ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే ఎమ్మెల్యే పీఏ గంగుల రమేష్ స్పందిస్తూ.. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని తెలిపారు. దీంతో ఈడీ సమన్ల వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉంది.
