శేరిలింగంపల్లిపై ప్రత్యేక దృష్టి
– తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
సైబరాబాద్ – విశాల భారతి
తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే క్రమంలో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని 15 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ తనపై పార్టీ అధినేత్రి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు. శేరిలింగంపల్లిలో పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ప్రజల మధ్యే ఉంటూ పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, యువతకు ఉపాధి అవకాశాలు, ఐటీ ఉద్యోగుల సమస్యలు, కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కేవలం వినడానికే పరిమితం కాకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావించి కలిసి ముందుకు సాగుతానన్నారు. ప్రతి వార్డులో, ప్రతి బూత్‌లో పార్టీ కమిటీలను చురుకుగా పనిచేసేలా చేసి, యువజన, మహిళా విభాగాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఇంటింటి ప్రచారం, ప్రజా సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తామని వివరించారు.ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వమే తన లక్ష్యమని, నెలకోసారి ప్రజా దర్బార్ నిర్వహించి స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవను ప్రధాన ధ్యేయంగా తీసుకుని శేరిలింగంపల్లిలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో కలిసి సమిష్టిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
