A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఎంఈఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వీ ధర్నా  

0 59

ఎంఈఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వీ ధర్నా
– విద్యార్థుల భద్రతతో చెలగాటమాడుతున్న పాఠశాలలపై చర్యలకు డిమాండ్
– ఎంఎన్ఆర్ పాఠశాలతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాటిని సీజ్ చేయాలి
– స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం: బీఆర్ఎస్వీ హెచ్చరిక

శేరిలింగంపల్లి,విశాల భారతి
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంఎన్ఆర్ పాఠశాలతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ శేరిలింగంపల్లి నాయకులు బుధవారం మండల విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు.ఉదయం నుంచే కార్యాలయం ఎదుటకు చేరుకున్న బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఎన్ఆర్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భద్రతా ప్రమాణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, శిథిలావస్థలో ఉన్న భవనంలో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందని వారు ఆరోపించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ, “విద్యార్థుల భద్రతే ప్రథమం. లాభాపేక్షతో నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలకు అనుమతులు కొనసాగించడం సరికాదు. విద్యాశాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, అగ్నిమాపక, భవన నాణ్యత, ఆటస్థలం వంటి కనీస ప్రమాణాలు లేని పాఠశాలలను గుర్తించాలి. ఎంఎన్ఆర్ పాఠశాలతో పాటు అలాంటి అన్ని ప్రైవేటు పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలి” అని డిమాండ్ చేశారు.అనేక పాఠశాలలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, పుస్తకాలు, దుస్తులను నిర్దిష్ట దుకాణాల్లోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు తనిఖీల పేరుతో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని, పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు.
“ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేనిపక్షంలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల ఎదుట ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం. జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం” అని బీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు.అనంతరం మండల విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు యామలవలస రాజు, విద్యార్థి నాయకులు మనీషా,శిరీన్, మణికంఠ, సాయి,కార్తీక్,అశోక్, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.