A place where you need to follow for what happening in world cup

- Advertisement -

శేరిలింగంపల్లి సర్కిల్లో బిల్డర్ ఓబుల్ రెడ్డి భరితెగింపు – అధికారుల మౌనం వెనుక మతలబు ఏమిటి? – ఈ నెల 13న విశాలభారతి దినపత్రికలో ప్రచురితమైన కథనం – 9 రోజులు గడిచినా చర్యలు శూన్యం సైబరాబాద్ – విశాల భారతి జూన్ 13 న విశాలభారతి పత్రికలో “శేరిలింగంపల్లి సర్కిల్‌లో కళ్లు మూసుకున్న అధికారులు” శీర్షికన వెలువడిన కథనానికి నేటికి 9 రోజులు గడిచినా సంబంధిత అధికారులు నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక బిల్డర్ ఓబుల్ రెడ్డి ప్రభుత్వ అనుమతులు లేకుండా, టౌన్ ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘించి శ్రీరామ్‌నగర్ బి.బ్లాక్‌లో భారీ భవనాలు నిర్మిస్తున్నారని కథనంలో వెల్లడైన విషయంపై అధికార యంత్రాంగం పూర్తిగా మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కథనం వెలువడిన వెంటనే టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసి అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు తేలితే సీజ్ చేసి, కూల్చివేతకు ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ ఇప్పటివరకు అలాంటి చర్యలు ఏమీ లేవు. స్థానికులు చెప్పిన మాటల ప్రకారం నోటీసులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక వైపు సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుండగా, ప్రభావవంతులైన బిల్డర్ల విషయంలో అధికారులు కళ్లు మూసుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఎందుకు జంకుతున్నారు…? శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ విభాగం గత కొంతకాలంగా వివాదాల్లోనే ఉంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేసే వారికి నోటీసులు ఇచ్చి వదిలేయడం, లేదా స్టేలు తెప్పించుకోవడానికి వెసులుబాటు ఇవ్వడం అధికారులకు అలవాటుగా మారిందని స్థానికుల ఆరోపణ. బిల్డర్ ఓబుల్ రెడ్డి విషయంలో కూడా అదే తంతు నడుస్తోందా? అనుమతులు లేకుండా నాలుగు భారీ భవనాలు వెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఒత్తిళ్లు ఉన్నాయా? లేక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కథనంలో పేర్కొన్నట్టు ఫైనాన్సింగ్ మసాలో దారి దొరికి ధృవపత్రాలు చేరుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు మౌనంగా ఉండడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. చైన్‌మెన్, ఔట్సోర్సింగ్ సిబ్బంది చేతుల్లోనే టౌన్ ప్లానింగ్ శాఖ… ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాల గుర్తింపు, నోటీసులు, కూల్చివేతల బాధ్యత అధికారులది. కానీ శేరిలింగంపల్లిలో ఆ బాధ్యత మొత్తం చైన్‌మెన్‌లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది చేతుల్లోకి వెళ్లిపోయింది. వారే క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నారు, వారే రిపోర్టులు రాస్తున్నారు, వారే “సెటిల్మెంట్లు” కుదుర్చుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బిల్డర్ ఓబుల్ రెడ్డి వంటి ప్రభావవంతుల విషయంలో ఈ సిబ్బంది కళ్లు మూసుకుంటుండడం వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే అనుమానాలు స్థానికంగా బలపడుతున్నాయి. అనుమతులు లేని భారీ భవనాలు అధికారులకు కనిపించలేదా…? శ్రీరామ్‌నగర్ బి. బ్లాక్‌లో బిల్డర్ ఓబుల్ రెడ్డి ప్రభుత్వ అనుమతులు లేకుండా నాలుగు భారీ భవనాలు నిర్మించారని 13న కథనం ఇచ్చాం. రోడ్డు విస్తరణకు భూములు కోల్పోయిన సామాన్యుల ఇళ్లపై అధికారులు విరుచుకుపడుతారు. కానీ కోట్ల రూపాయల పెట్టుబడితో వెలిసిన ఈ భారీ కట్టడాలు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి, చైన్‌మెన్‌లకు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనిపించలేదా? కనిపించినా కమీషన్ కోసం మౌనం వహిస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రజాగ్రహం ఉవ్వెత్తున… ప్రభుత్వం ఒక వైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని ప్రచారం చేసుకుంటుండగా, మరోవైపు శేరిలింగంపల్లిలో మాత్రం అధికారులు కళ్లు మూసుకోవడం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. అనుమతులు లేని భవనాల్లో నివాసం ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? ప్రభుత్వం, ప్రజల సొమ్ముతో నిర్మించిన మౌలిక సదుపాయాలు ఈ అక్రమ కట్టడాల వల్ల దెబ్బతింటే నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, డబ్బున్న బిల్డర్లకు మరో న్యాయం అమలు చేస్తున్నారనే భావన బలంగా ఉంది. కథనం వచ్చి 9 రోజులు దాటినా విచారణకు ఆదేశించామని, విచారణ కొనసాగుతోందని కూడా అధికారులు ప్రకటించలేకపోవడం వారి నిబద్ధతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వహిస్తే, పైస్థాయి అధికారులు, మంత్రులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ విధానాలు కాగితాలకే పరిమితమై, క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయా? అక్రమ నిర్మాణాలపై చర్యలకు డిమాండ్.. స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నది ఒక్కటే – బిల్డర్ ఓబుల్ రెడ్డి నిర్మాణాలపై తక్షణమే విచారణ జరిపి, అక్రమాలు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరి ఒత్తిడికి లొంగకుండా నిబంధనలు అమలు చేయాలి. లేకపోతే అధికారుల మౌనం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి, వ్యక్తుల ప్రయోజనాలను కాపాడే అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

0 71

 

Leave A Reply

Your email address will not be published.