– 250 మందితో టీఆర్‌ఎస్‌లోకి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
– కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత
శేరిలింగంపల్లి – విశాల భారతి
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తన సతీమణి నివేదిత, అనుచరులు రఘురాం, రవికృష్ణతో పాటు మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలకు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలతో కలిసి గురువారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు.పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో చంద్రశేఖర్ ప్రసాద్ దంపతులకు, ఇతర ముఖ్య నేతలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో, బీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేసిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ కుటుంబం నేడు తెలంగాణ రక్షణ సేనలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు తాను తోడుగా ఉంటానని, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులతో పేదవాడు చదువుకు దూరమవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సర్కార్ దవాఖానాకు వెళితే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉందని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే లక్షల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు. విద్య, వైద్యం రెండూ పేదవాడికి గుదిబండగా మారాయని ఆమె పేర్కొన్నారు.తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షాన ప్రశ్నించే నాయకత్వంగా ఎదగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పేదలకు ఇళ్ల పంపిణీ కొనసాగుతూనే ఉందని, కానీ అర్హులకు కాకుండా నాయకులు, కార్యకర్తలు బాగుపడుతున్నారని మండిపడ్డారు. నా రాష్ట్రం నా ఇంటి కుటుంబం లాంటిదని, నా ఇంటికి ఏమి కావాలో నా రాష్ట్రానికి ఏమి కావాలో తెలిసిన వ్యక్తినని కవిత అన్నారు. పార్టీ క్రమశిక్షణతో, గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతుందని, బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
