రోడ్డుపై చెత్త విసిరిన మహిళ
– అడ్డుకున్న కార్మికురాలిపై దాడి యత్నం
* ఆల్విన్ కాలనీ సర్కిల్ 51 లో శనివారం ఉద్రిక్తత
– వీడియో వైరల్.. వాహనం నంబర్ ఆధారంగా చర్యలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ
– విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు తప్పవని అధికారుల హెచ్చరిక
సైబరాబాద్ – విశాల భారతి
స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నా కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు పగలు రాత్రి కష్టపడి నగరాన్ని శుభ్రం చేస్తుంటే వారి శ్రమను అవమానించేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఆల్విన్ కాలనీ సర్కిల్ 51 పరిధిలోని వెంకటేశ్వర నగర్ వెళ్లే దారిలో దీనబంధు కాలనీ వడ్డేపల్లి ఎంక్లేవ్ నాలా వద్ద ప్రధాన రోడ్డులో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఘటన.
*ఏం జరిగిందంటే..*
శనివారం ఉదయం 10 గంటల సమయం ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని దీనబంధు కాలనీ వడ్డేపల్లి ఎన్క్లేవ్ వద్ద ఉన్న నాలా ప్రధాన రోడ్డుపై జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ఊడుస్తూ, చెత్తను సేకరిస్తున్నారు. అదే సమయంలో పింక్ కలర్ టాప్ ధరించిన ఓ మహిళ ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చింది. ఆమె తన చేతిలో ఉన్న చెత్తను అలాగే రోడ్డుపై విసిరేసింది.అది గమనించిన ఆరెంజ్ జాకెట్ ధరించిన సీఎంసీ మహిళా కార్మికురాలు వెంటనే స్పందించింది. “మేడం, రోడ్డుపై చెత్త వేయకూడదు. ఇప్పుడే ఊడ్చాం. దయచేసి డస్ట్‌బిన్‌లో వేయండి లేదా స్వచ్ఛ ఆటో వచ్చినప్పుడు ఇవ్వండి” అని వినయంగా సూచించింది. అయితే ఆ మహిళ సహనం కోల్పోయింది. ఒక్కసారిగా ఆగ్రహంతో కార్మికురాలిపైకి దూసుకెళ్లింది. ఆమె కాలర్ పట్టుకుని నెట్టివేసేందుకు యత్నించింది. దాడి చేసేందుకు చేయి లేపింది.అక్కడే ఉన్న మరో పురుష కార్మికుడు, స్థానికులు వెంటనే కల్పించుకుని ఇద్దరినీ విడదీశారు. లేకపోతే పరిస్థితి చేయిదాటిపోయేదే. ఈ తోపులాట, వాగ్వాదం దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో క్లిప్ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
*కార్మికుల ఆవేదన.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది*
“మేము తెల్లవారుజామున 5 గంటలకే విధులకు వస్తాం. ఎండనకా, వాననకా రోడ్లు ఊడ్చి మీకు శుభ్రమైన వాతావరణం ఇస్తున్నాం. చెత్త వేయొద్దని బతిమిలాడితే మాపైనే చేయి చేసుకుంటారా? మేమేం పాపం చేశాం?” అని బాధిత మహిళా కార్మికురాలు కన్నీళ్లు పెట్టుకుంది. “మాకు రక్షణ లేదు. మా బాధలు పట్టించుకునే నాథుడే లేడు” అని ఇతర కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
*వాహనం నంబర్ నోట్.. అధికారులకు నివేదిక*
“ఘటన జరిగిన వెంటనే మా సూపర్‌వైజర్‌కు సమాచారం ఇచ్చాం. ఆ మహిళ వచ్చిన వాహనం నంబర్ నోట్ చేసుకున్నాం. వీడియో ఆధారాలతో పాటు పూర్తి నివేదికను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి శానిటేషన్ డిప్యూటీ కమిషనర్‌కు పంపుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగి విధికి ఆటంకం కలిగించడం, దాడికి యత్నించడం నేరం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని స్థానిక శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
*సీఎంసీ అధికారుల తీవ్ర హెచ్చరిక*
“పారిశుద్ధ్య కార్మికులు మన ఇంటిని శుభ్రం చేసే సభ్యుల లాంటివారు. వారితో దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించం. ఈ ఘటనపై విచారణ జరిపి వాహనం నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి నోటీసులు జారీ చేస్తాం. అవసరమైతే పోలీస్ కేసు నమోదు చేస్తాం. ప్రజలు స్వచ్ఛ ఆటోలకే తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. రోడ్డుపై వేస్తే సీసీ కెమెరాలు, వీడియోల ఆధారంగా జరిమానాలు విధిస్తాం” అని జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హెచ్చరించారు.
*ప్రజాప్రతినిధుల స్పందన*
ఘటనపై స్థానిక మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ రావు స్పందిస్తూ “కార్మికుల జోలికి వస్తే సహించం. ఆ మహిళ క్షమాపణ చెప్పాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజలంతా స్వచ్ఛత కోసం కార్మికులకు సహకరించాలి” అని పిలుపునిచ్చారు.
.
