మీల్స్ లో ప్లాస్టిక్ కవర్.. ఫిర్యాదు చేస్తే “మరో ప్లేట్ తీసుకోండి” అన్న ఫ్యూయల్ బాక్స్ సిబ్బంది
– మదీనాగూడ రెస్టారెంట్ నిర్లక్ష్యంపై కస్టమర్ల ఆగ్రహం
– ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపైనా విమర్శలు
సైబరాబాద్ – విశాల భారతి
మదీనాగూడ మైత్రి కమాన్ సమీపంలోని శ్రీకర హాస్పిటల్ లైన్‌లో ఉన్న ఫ్యూయల్ బాక్స్ రెస్టారెంట్‌లో వడ్డించిన మీల్స్‌లో ప్లాస్టిక్ కవర్ ముక్క బయటపడిన ఘటన కలకలం రేపింది. ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి వచ్చిన ఓ వ్యక్తి మీల్స్‌లో భాగంగా ఇచ్చిన పాయసంలో ప్లాస్టిక్ కవర్ ముక్క కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే కౌంటర్ వద్దకు వెళ్లి విషయం చెప్పగా, క్షమాపణ చెప్పాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారని బాధితుడు ఆరోపించాడు. “అలా జరిగిందా… మరో ప్లేట్ తీసుకోండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు, సమస్య తీవ్రతను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపాడు.
అంతటితో ఆగకుండా, “ఇది మా వద్ద జరగలేదు… బయట నుంచి ఫుడ్ తెప్పిస్తాం… మా తప్పు కాదు… మేనేజర్‌ను కలవండి” అంటూ బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేసుకున్నారని బాధితులు వాపోయారు. వినియోగదారుడి ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో బాధ్యతాయుతంగా స్పందించాల్సిన రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంబించడంపై కస్టమర్లు మండిపడ్డారు.
పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ఆహారం తయారు చేయడం, నాణ్యత నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. డబ్బులు పూర్తిగా వసూలు చేసి, అపరిశుభ్రమైన ఆహారం అందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి ఆహారం తీసుకుంటే వారి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, ఇదే రెస్టారెంట్‌పై గతంలో కూడా పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిర్వహణలో లోపాలపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు, చలాన్లు, పెనాల్టీలు విధించడం వరకే పరిమితమవుతున్నారే తప్ప, పునరావృతమవుతున్న ఉల్లంఘనలను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోటల్ యాజమాన్యాలకు భయం లేకుండా పోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహరించి, పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని అవసరమైతే లైసెన్సుల రద్దు వంటి చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, రెస్టారెంట్‌లో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార తయారీ విధానాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, వినియోగదారుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
