గ్రీక్ పురాణాల్లోని తొమ్మిది తలల విషసర్పంలా హైడ్రా మారింది
– తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
– రంగనాథ్ కోర్టు ధిక్కరణ కేసు విచారణలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం
హైదరాబాద్ – విశాల భారతి
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ శాఖలు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, “ఈ సమస్య గ్రీక్ పురాణాల్లోని తొమ్మిది తలల విషసర్పం ‘హైడ్రా’లా మారిపోయింది” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.ఒక సమస్యను పరిష్కరించినా మరో సమస్య తలెత్తుతున్న పరిస్థితి నెలకొన్నట్లు కోర్టు పేర్కొంది.కోర్టు ఆదేశాల అమలులో జాప్యం, అధికారులు పరస్పరం బాధ్యతలు తప్పించుకునే ధోరణి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై వ్యక్తిగతంగా దృష్టి సారించి, కోర్టు ఆదేశాలు అమలయ్యేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే ప్రత్యామ్నాయ అధికారిని నియమించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కూడా స్పష్టం చేసింది.కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర విమర్శలుగా భావిస్తున్నారు. కోర్టు ఆదేశాల అమలుపై ఇకపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
