ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో భారీ చోరీ
– హుండీతో పాటు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాల అపహరణ
– నిఘా దృశ్యాల నమోదు పరికరాన్నీ ఎత్తుకెళ్లిన దుండగులు
రాజేంద్రనగర్ – విశాల భారతి
ఖానాపూర్ పట్టణంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడి భక్తులను కలవరపరిచారు. హుండీలోని నగదుతో పాటు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు. ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆలయంలోని నిఘా దృశ్యాల నమోదు పరికరాన్ని కూడా తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల రూపాయలకు పైగా ఆస్తి చోరీకి గురైనట్లు ఆలయ కమిటీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.
మంగళవారం తెల్లవారుజామున పూజల కోసం ఆలయానికి వచ్చిన అర్చకుడు తాళాలు పగులగొట్టబడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు హుండీని ధ్వంసం చేసి అందులోని నగదును తీసుకెళ్లడంతో పాటు అమ్మవారి బంగారు కిరీటం, నగలు, వెండి పూలు, పూజా సామగ్రిని అపహరించినట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆలయంలో ఏర్పాటు చేసిన నిఘా దృశ్యాల నమోదు పరికరాన్ని కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ పరిస్థితులపై అవగాహన ఉన్నవారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాల సేకరణ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, పరిసర ప్రాంతాల్లోని నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టింది. ఘటనతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయాలకు మరింత భద్రత కల్పించాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నారు.
