చందానగర్‌లో గంజాయి గుట్టురట్టు
– ఒడిశా నుంచి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
– 1.5 కిలోల గంజాయి స్వాధీనం
సైబరాబాద్ – విశాల భారతి
ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 1.5 కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, పాలిథిన్ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశాలోని కుందులి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు మంగళవారం విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. అదే సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.వారిని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. అరెస్టయిన వారిని విశాఖపట్నానికి చెందిన మెరిపాటి మనోజ్‌కుమార్ (22), విజయనగరం జిల్లా లోతుగడ్డ మెంటాడకు చెందిన ఎం.ఆశాజ్యోతి (23)గా గుర్తించారు. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.విచారణలో భాగంగా నిందితులు ఒడిశాలోని కుందులి ప్రాంతానికి వెళ్లి గంజాయిని కొనుగోలు చేసినట్లు, అనంతరం దానిని హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. గంజాయిని ఎవరెవరికి విక్రయిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
