నవీన్ రెడ్డి నీచ చరిత్ర అందరికీ తెలుసు
– ముడుపులు రూ. 50 తీసుకున్నట్లు నిరూపించిన రాజీనామా
– వీర్లపల్లి శంకర్ సవాల్
– సిద్దాపూర్‌కు డంపింగ్ యార్డ్ రాకుండా చూస్తా
షాద్‌నగర్ – విశాల భారతి
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు కుట్రపూరితమైనవని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ రెడ్డి, లోకల్ కేఏ పాల్ కలిసి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం షాద్‌నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉదయం 10 గంటలకే కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. అట్టడుగు వర్గం నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా, సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా ఎదిగానని, తన ఎదుగుదల ఓర్చుకోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తనపై చేసిన 50 కోట్ల ముడుపుల ఆరోపణలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. గత ఎన్నికల్లో మహిళలకు పట్టగొలుసులు ఇస్తానని చెప్పి కేఏ పాల్ మోసం చేశారని, ఇప్పుడు సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ అంశాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సిద్దాపూర్‌లో పేదలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, వాటిని లాక్కుని పారిశ్రామిక పార్కు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా చేసిందని అన్నారు. 2018 ఆగస్టు 9న టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ 233 ఎకరాల 10 గుంటల భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ సమయంలోనే దాదాపు 80 మంది బినామీ రైతుల పేరిట 9 కోట్లకు పైగా ప్రభుత్వ డబ్బులు బీఆర్ఎస్ నాయకులు కొల్లగొట్టారని ఆరోపించారు. వారే ఇప్పుడు నవీన్ రెడ్డితో కలిసి ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఈ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నదని, అక్రమార్కుల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని వెల్లడించారు.
సిద్దాపూర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయబోమని, ఎకో పార్కు కోసం జీవో 641 ఇచ్చామని స్పష్టం చేశారు. సిద్దాపూర్ సమస్యపై అఖిలపక్షం ఏర్పడితే తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ గానీ, ఎకో పార్క్ గానీ సిద్దాపూర్‌కు రాకుండా చూసే బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందెమోహన్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
