కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో ప్రభుత్వం సంచలన నిర్ణయం
– ఇక మధ్యవర్తులు లేరు.. డబ్బు నేరుగా ఖాతాల్లోకే
– అర్హులకు సకాలంలో సాయం అందించేందుకు కసరత్తు
హైదరాబాద్ – విశాల భారతి
పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా మార్చి, సాయం మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
ఇన్నాళ్లు మధ్యవర్తులు, కొన్ని సంస్థల ద్వారా జరుగుతున్న చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అర్హులకు సకాలంలో సాయం అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమలు చేయనుంది. దీనివల్ల అవకతవకలకు ఆస్కారం లేకుండా పోతుందని, ప్రతి రూపాయి అర్హులకే చేరుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లోనే పూర్తి ప్రక్రియ…
కొత్త విధానంలో దరఖాస్తు నుంచి చెల్లింపు వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దరఖాస్తుదారుడు సమర్పించిన ఆధార్, బ్యాంక్ ఖాతా, కుల, ఆదాయ ధ్రువపత్రాలను డిజిటల్‌గా పరిశీలించి అర్హత నిర్ధారించిన వెంటనే నిధులు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
పేదలకు పెద్ద ఊరట..
పెళ్లి ముందే సాయం అందక వడ్డీలకు అప్పులు చేసే పరిస్థితి ఇక ఉండదు. డబ్బు నేరుగా ఖాతాలో పడటంతో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి ఖర్చులు భరించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు కూడా సులభంగా సాయం పొందేందుకు వీలు కలుగుతుంది.
ఈ కొత్త విధానంపై త్వరలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు మేలు జరగనుంది.
