– మియాపూర్ స్కూల్ కేసులో కోర్టు సంచలన తీర్పు
సైబరాబాద్ – విశాలభారతి: పాఠశాల అంటే పిల్లలకు రెండో ఇల్లులాంటిది. అక్కడ చిన్నారులు సురక్షితంగా ఉంటారనే నమ్మకం ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. కానీ మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటన ఆ నమ్మకాన్ని కదిలించింది. 2019లో మూడేళ్ల బాలికపై పాఠశాల జిమ్నాస్టిక్స్ కోచ్ లైంగిక దాడికి పాల్పడగా, చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పై కూడా కేసు నమోదైంది. పాఠశాలకు వెళ్లిన తర్వాత బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా రాజేంద్రనగర్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. పూర్తి విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన జిమ్నాస్టిక్స్ కోచ్‌కు పోక్సో చట్టం కింద 20 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగారం, 20 వేల రూపాయల జరిమానా విధించారు. చిన్నారుల భద్రతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు మూడు ఏళ్ల సాధారణ కారాగారం, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. బాధిత బాలికకు న్యాయస్థానం మూడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ తీర్పును వెల్లడిస్తూ సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ మాట్లాడుతూ చిన్నారులపై జరిగే ఏ చిన్న నేరాన్ని కూడా పోలీసులు ఉపేక్షించబోమని తెలిపారు. పాఠశాలలు, విద్యాసంస్థలు చిన్నారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తీర్పుతో చిన్నారుల భద్రతకు సంబంధించి సమాజంలో ఒక స్పష్టమైన సందేశం వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.
