A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ప్రశ్నించినందుకే కేసులా…?

0 147

– మియాపూర్‌లో విద్యార్థి నేతలపై అక్రమ కేసులపై దుమారం
– అడ్డగోలు ఫీజులు, యూనిఫామ్ దోపిడీని ఎండగట్టినందుకే నలుగురు నేతలపై కేసు నమోదు

సైబరాబాద్ – విశాలభారతి: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకులపై పోలీసు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘాలకు చెందిన నలుగురు నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రతి విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు పెంచడం, నిర్ణీత షాపుల్లోనే యూనిఫామ్‌లు, పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి పరిధిలోని పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అక్రమంగా యూనిఫామ్‌లు అమ్ముతున్నారని విద్యార్థి సంఘ నాయకులు గళం విప్పారు. తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వం, విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.కానీ సమస్యలను ఎత్తిచూపినందుకే నాయకులపై యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విద్యార్థి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్ టీవీ ఛానల్ లో ప్రసారమైన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన నేతలు, ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, మండల విద్యాధికారి అధికారులు వాటికి వంతపాడుతున్నారని ఆరోపించారు. శేరిలింగంపల్లి పరిధిలో స్కూళ్లు విద్యార్థుల, తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, ఈ విషయంలో అధికారులు స్పందించకుండా మౌనం వహిస్తున్నారని వారు విమర్శించారు. చట్టపరంగా ఈ కేసులను ఎదుర్కొంటామని, అయినా విద్యార్థుల సమస్యలపై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, యూనిఫామ్‌ల అమ్మకాలపై ప్రభుత్వ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థుల తరపున గొంతు వినిపించడం నేరమైతే తాము ఆ నేరం చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని విద్యార్థి నేతలు తేల్చిచెప్పారు.

Leave A Reply

Your email address will not be published.