– ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజలకు సహాయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది
సైబరాబాద్, విశాలభారతి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న ఏడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తం కాకుండా పోలీసు శాఖ అన్ని విభాగాలు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నాయి. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది రోడ్లపై మోహరించి ప్రజలకు సహాయం అందిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసుల విధులు
వర్షం వల్ల దృశ్యమానత తగ్గి, రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడళ్లు, బిజీ రోడ్లు, ఐటీ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్లు, మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల కింద, అండర్‌పాస్‌ల వద్ద నీరు నిలిచిన చోట్ల వాహనదారులను ముందుగానే మళ్లిస్తూ ప్రమాదాలను నివారిస్తున్నారు. బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను వెంటనే పక్కకు తరలించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. టోయింగ్ వాహనాలు కూడా అందుబాటులో ఉంచారు.
లా అండ్ ఆర్డర్ సిబ్బంది సహాయం
వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లలకు లా అండ్ ఆర్డర్ సిబ్బంది సహాయం అందిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో నిలబడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నీరు నిలిచి ప్రమాదం ఉందని గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కూలిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించే పనిలో సీఎంసీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటున్నారు.
వర్షపు నీటితో నిండిన కాలువలు, నాల వద్ద ప్రజలను ఆపి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.
పోలీస్ కమిషనర్ ఆదేశాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఫీల్డ్‌లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి:
1. అవసరం లేనిదే ఇంటి నుంచి బయటకు రావద్దు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉంటే వినియోగించుకోవాలి.
2. వాహనదారులు వేగంగా నడపకుండా, హెడ్‌లైట్లు వేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
3. లోతట్టు ప్రాంతాలు, అండర్‌పాస్‌లు, నాల వద్దకు వెళ్లవద్దు.
4. రోడ్డుపై నీరు నిలిచిన చోట వాహనం నడిపేటప్పుడు ఇంజిన్ ఆఫ్ అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించాలి.
5. ట్రాఫిక్ పోలీసులు, వాలంటీర్లు ఇచ్చే సూచనలు, డైవర్షన్లను తప్పనిసరిగా పాటించాలి.
6. ఏదైనా అత్యవసర సహాయం కావాలంటే 100, ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్లకు కాల్ చేయాలి.
ప్రజల భద్రత, సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా సైబరాబాద్ పోలీసులు వర్షం తగ్గే వరకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు.
