చేవెళ్లలో ఆరుగురి హత్యలు.. నిందితుడి కోసం 7 బృందాల వేట
– ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోష్ వెల్లడి
– పోలీసులపై ఆరోపణలకూ విచారణ
రాజేంద్రనగర్ – విశాల భారతి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన ఆరుగురు హత్యల కేసులో నిందితుడి కోసం ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ తరుణ్ జోష్ తెలిపారు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన, నిందితుడు రాజ్‌కుమార్ వరుసగా ఆరుగురిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.సీపీ వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య రాజ్‌కుమార్ షాబాద్ గ్రామానికి చేరుకుని, యువతి తల్లిని కత్తితో హత్య చేశాడు. అనంతరం అదే ఇంట్లో నిద్రిస్తున్న యువతి అమ్మమ్మను కూడా హత్య చేశాడు. అక్కడి నుంచి యువతిని తన వెంట తీసుకెళ్లి దైవాలగూడ గ్రామ సమీపంలోని చెరువు వద్ద హత్య చేసినట్లు గుర్తించామని తెలిపారు.ఆ తర్వాత నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా దారుణంగా హత్య చేశాడని వెల్లడించారు. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపి, తాను కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని చెప్పి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సీపీ వివరించారు.ప్రస్తుతం నిందితుడి ఆచూకీ కోసం ఏడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, సాంకేతిక ఆధారాలతో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. స్థానికులు పోలీసుల నిర్లక్ష్యంపై చేసిన ఆరోపణల విషయంలో కూడా ప్రత్యేక విచారణ చేపడతామని సీపీ తరుణ్ జోష్ స్పష్టం చేశారు.ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేపగా, హత్యలకు గల అసలు కారణాలు, సంఘటనల క్రమంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
