తనిఖీల్లో చోరీ వాహనం గుర్తింపు
– మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత
సైబరాబాద్ – విశాల భారతి
వాహన తనిఖీల్లో మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. శుక్రవారం సాయంత్రం మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎవరూ లేకుండా పార్కింగ్‌లో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు. అనుమానంతో ఓ హీరో ప్లెజర్ స్కూటీ వివరాలను తనిఖీ చేయగా, అది మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన చోరీ కేసుకు సంబంధించినదిగా తేలింది. వాహనంపై క్రైమ్ నంబర్ 1001/2026, బీఎన్‌ఎస్ సెక్షన్ 305(బి) కింద కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
వెంటనే మియాపూర్ పోలీస్‌స్టేషన్ డీఐకి సమాచారం అందించిన ట్రాఫిక్ పోలీసులు, వాహనాన్ని సంబంధిత పోలీసులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. సాధారణ తనిఖీల్లోనూ పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై దృష్టిసారించి చోరీ వాహనాన్ని గుర్తించడం మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత, విధి నిర్వహణకు నిదర్శనంగా నిలిచింది.
