ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయం
– తెల్లాపూర్‌లో మెడికల్ షాపుపై పోలీసుల దాడి
– ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సైబరాబాద్ – విశాల భారతి
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పి నివారణకు వినియోగించే ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్న మెడికల్ షాపుపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మై ఫెయిర్ రోడ్, తెల్లాపూర్‌లోని శ్రీ గణేష్ మెడికల్ షాపులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పైవాన్ స్పాస్ ప్లస్ (Pyeevon Spas Plus) క్యాప్సూల్స్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మందుల్లో డైసైక్లోమిన్ హెచ్‌సీఎల్, ట్రామడాల్ హెచ్‌సీఎల్, ఎసిటామినోఫెన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అవసరమైన ఔషధాలను నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
