గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి
సైబరాబాద్ – విశాల భారతి
గచ్చిబౌలిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న మల్లం భవాని (23), అంజయ్యనగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న తన స్నేహితురాలు సుభాషిని (30)తో కలిసి యాక్టివాపై ట్రిపుల్ ఐటీ నుంచి అంజయ్యనగర్ వైపు వెళ్తున్నారు.
గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపానికి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భవాని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. సుభాషిని తీవ్ర గాయాలతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
