సైబరాబాద్‌లో మహిళల భద్రతకు పెద్దపీట
– వారం రోజుల్లో 116 డికాయ్ ఆపరేషన్లు
– 37 మంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
సైబరాబాద్ – విశాల భారతి
మహిళలు, చిన్నారుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను అధికారులు వెల్లడించారు. షీ టీమ్స్ వివిధ ప్రాంతాల్లో 116 డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 37 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై 56 పెట్టీ కేసులు నమోదు చేయగా, 15 ఫిర్యాదులు స్వీకరించారు.మానవ అక్రమ రవాణాపై చర్యల్లో భాగంగా ముగ్గురు బాధితులను రక్షించి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కుటుంబ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌తో 33 విడిపోయిన జంటలు తిరిగి ఒక్కటయ్యాయి. మహిళల భద్రత, బాల్య వివాహాల నిరోధం, సైబర్ వేధింపులు, మానవ అక్రమ రవాణాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో 3,407 మంది పాల్గొన్నారు.
మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ..
సెప్టెంబర్ 30న రహేజా మైండ్‌స్పేస్‌లో మహిళా ఉద్యోగులకు అవగాహన, ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చారు. 40 మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. ఇన్‌స్పెక్టర్ వై. హనుమాన్ గౌడ్, మహిళా ఎస్‌ఐ అంబిక, ప్రతినిధి రష్మి చట్టపరమైన హక్కులు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించారు. రుద్రమదేవి అకాడమీ ప్రతినిధులు ఆచరణాత్మక ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో మహిళల హెల్ప్‌లైన్ 181, బాలల హెల్ప్‌లైన్ 1098, పోలీసులకు 100 లేదా 112, సైబర్ నేరాలకు 1930ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
