A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం

0 90

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం
– ఏకంగా 333 మంది మందుబాబులు లాక్

సైబరాబాద్ – విశాల భారతి
వీకెండ్ వస్తే చాలు మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి ఇష్టారాజ్యంగా వాహనాలు తోలే మందుబాబులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా చేశారు.వారాంతం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్‌లో ఏకంగా 333 మంది తాగి వాహనాలు నడుపుతూ కంటికి చిక్కారు. ఈ స్పెషల్ చెకింగ్స్‌లో దొరికిన వారిలో సింహభాగం బైకర్లే కావడం గమనార్హం. మొత్తం 269 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేయగా 51 మంది కార్ల డ్రైవర్లు, 11 మంది ఆటో డ్రైవర్లు,ఇద్దరు హెవీ వెహికల్ డ్రైవర్లు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.రక్తంలో ఆల్కహాల్ స్థాయులను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.262 మంది రక్తంలో ఆల్కహాల్ పరిమాణం 36 నుంచి 200 మిల్లీగ్రాములుగా నమోదవ్వగా, 50 మందిలో 201 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు ఉన్నట్లు తేలింది.ఇక మరో 21 మందిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో 301 నుంచి 550 మిల్లీగ్రాముల వరకు ఆల్కహాల్ స్థాయులు నమోదు కావడం గమనార్హం.నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించిన వీరందరినీ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తే పదేళ్ల జైలు!

మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తాగి వాహనం నడుపుతూ ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే నూతన చట్టం ‘భారతీయ న్యాయ సంహిత–2023’లోని సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీగా ఫైన్ తప్పదని విస్పష్టంగా వెల్లడించారు.మరోవైపు గత వారం (జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు) రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి న్యాయస్థానాలు 232 కేసులను పరిష్కరించాయి. కోర్టు విచారణ అనంతరం ముగ్గురికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించగా, ఆరుగురికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మిగిలిన 223 మందికి ఫైన్ విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.