గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు
– 20 కిలోల గంజాయితో పట్టుబడిన నిందితులకు రూ.25 వేల చొప్పున జరిమానా
కొత్తగూడెం లీగల్ – విశాల భారతి
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, 2020 మార్చి 22న బూర్గంపాడు ఎస్‌ఐ బి. బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి సారపాక బస్‌స్టాప్ సెంటర్ రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో హోండా స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన బీమనపల్లి శ్రీనివాసులు, రావీరాల లక్ష్మీనారాయణలుగా గుర్తించి బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.అప్పటి ఏఎస్ఐ కే. సోమేశ్వరరావు కేసు నమోదు చేయగా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు పి. నవీన్, టి. సత్యనారాయణ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఏడుగురు సాక్షులను పరిశీలించిన న్యాయస్థానం నిందితులపై అభియోగాలు రుజువయ్యాయని తేల్చి ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధించింది.ప్రాసిక్యూషన్ తరఫున పి. ఫణికుమార్ వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ అధికారి డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ అధికారి ఎస్. వీరభద్రం, కోర్టు డ్యూటీ అధికారి పీసీ అక్రమ్ తదితరులు విచారణ నిర్వహణలో సహకరించారు.
