చెరువు బఫర్ జోన్‌లో విల్లాల నిర్మాణం
– హైడ్రా చర్యలపై పలు అనుమానాలు
సైబరాబాద్ – విశాల భారతి
దుండిగల్ లోని మల్లంపేట కటకంలో చెరువు నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. నీటిపారుదల శాఖ స్పష్టమైన హెచ్చరికలు చేసినా కూడా సదరు అక్రమ నిర్మాణాలకు అధికారులు పచ్చజెండా ఊపిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. నగరవ్యాప్తంగా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా, ఈ భారీ విల్లాల ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న పేదల ఇళ్లను తక్షణమే కూల్చివేసే యంత్రాంగం, వందల కోట్ల విలువైన ఈ బహుళ అంతస్తుల విల్లాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న తెరవెనుక వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.బాధ్యతాయుతమైన స్థానిక వర్గాలు అందించిన సమాచారం ప్రకారం దుండిగల్ చెరువు బఫర్ పరిధిలోనే ఈ విల్లాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దాదాపు ఎనిమిది ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ విలువైన భూమి నీటి ప్రవాహ ప్రాంతంలో ఉందని ఏడాదిన్నర క్రితమే నీటిపారుదల శాఖ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ప్రణాళికాబద్ధంగా చెరువు ఉనికిని దెబ్బతీసేలా ఉన్న ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసినప్పటికీ, అధికారులు మాత్రం అన్ని నిబంధనలను పక్కనబెట్టి ప్రైవేటు సంస్థకు పచ్చజెండా ఊపారు. ప్రైవేటు డెవలపర్లు అధికారుల కన్నుకప్పి నిబంధనలను అతిక్రమిస్తున్నారా లేక ముడుపులు అందుకొని అధికారులే అక్రమాలకు రాచబాట వేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.బాహ్య వలయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును అత్యంత విలాసవంతమైన నివాస ప్రాంతంగా ప్రచారం చేస్తూ సదరు నిర్మాణ సంస్థ ఇప్పటికే అమ్మకాలు కూడా ప్రారంభించింది. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయనే నమ్మకంతో సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే రేపటి రోజున చెరువు బఫర్ జోన్ వివాదం సృష్టించే ముప్పు ఉందనే విషయాన్ని దాచిపెట్టి కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక చిన్న చిన్న వ్యాపార సముదాయాలు, ఇళ్లపై కఠినంగా వ్యవహరించిన అధికారులు, ఇంత భారీ ప్రాజెక్టు కళ్లముందే నిర్మితమవుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటనేది స్థానికులకు అర్థం కావడం లేదు.ఈ ప్రాంతంలోని ప్రజాసంఘాలు, నివాసితులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షాకాలంలో సమీప నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఈ దుండిగల్, మల్లంపేట పరిసరాల్లోని రహదారులు నీటమునిగిన ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు బడా నిర్మాణ సంస్థలకు రెడ్ కార్పెట్ పరచడం ద్వారా చట్టం అందరికీ ఒకేలా వర్తించడం లేదనే సంకేతాలు సమాజంలోకి వెళ్తున్నాయి.
హైడ్రా కమిషనర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ నిర్మాణంపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో నీటిపారుదల శాఖ ఇచ్చిన లేఖను పక్కనబెట్టి ఏ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారో బయటపెట్టాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో చెరువుల పరిరక్షణ నామమాత్రమేనని, నిబంధనలు కేవలం కమీషన్లు ఇవ్వని నిరుపేదలకే వర్తిస్తాయనే భావన మరింత బలపడుతుంది. ఇప్పటికైనా స్థానిక అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి దుండిగల్ చెరువు పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
