హైదర్‌షాకోట్‌లో దారుణం 5 బైక్‌లు దగ్ధం!
– సాయిరాం నగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
– అగంతకుడి వికృత చేష్టగా అనుమానం
రాజేంద్రనగర్ – విశాల భారతి
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీలో అర్ధరాత్రి తీవ్ర భయాందోళనలు సృష్టించిన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసి ఉంచిన ఐదు ద్విచక్ర వాహనాల్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించి, ఐదు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సీసీటీవీలో అగంతకుడు.. విచారణలో పోలీసులు..
ఈ ప్రమాదంపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, రాత్రి 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి అక్కడ సంచరించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఎవరో కావాలనే బైక్‌లకు నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్ర పూరితంగా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
