కబ్జాదారుల చెరలో 50 కోట్ల బల్దియా భూమి
– చందానగర్‌లో 4 వేల గజాల స్థలం ఆక్రమణ
– మహిళలతో పోరాటం తప్పదు: మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి
చందానగర్ – విశాల భారతి
మహిళా భవనం, ఫంక్షన్ హాల్ కోసం కేటాయించిన 50 కోట్ల విలువైన బల్దియా భూమి కబ్జాదారుల పాలైంది. చందానగర్ కైలాష్ నగర్‌లోని 4 వేల గజాల స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించారని మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి ఆరోపించారు. జిల్లా కలెక్టర్ 2018, 2019లో ఉత్తర్వులిచ్చి బల్దియాకు కేటాయించిన ఈ స్థలానికి 2019లో ప్రహరీ నిర్మించారు. అయితే 2022 ఆగస్టులో, 2024 ఫిబ్రవరిలో కబ్జాదారులు దౌర్జన్యంగా ప్రహరీని కూల్చేశారు. రెండేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, ప్రజాప్రతినిధి అండతోనే ఆక్రమణలు సాగుతున్నాయని ఆమె మండిపడ్డారు.కలెక్టర్ ఉత్తర్వులున్నా పట్టించుకోని అధికారులు, అనుమతులు లేకుండా అదే స్థలంలో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి సహకరించారని విమర్శించారు. ఆర్టీఐలో విద్యుత్ శాఖ వద్ద కూడా కేటాయింపు పత్రాలు లేవని తేలిందన్నారు.
తక్షణమే భూమిని స్వాధీనం చేసుకుని మహిళా భవనం నిర్మించాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే మహిళలతో కలిసి పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామని నవతారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి లో జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు
