పోలీస్ సంక్షేమంలో కొత్త అధ్యాయం
– అల్లాపూర్ ఠాణాలో బ్యారక్స్‌కు ప్రారంభం*
– రితిరాజ్, సీపీ రమేష్ చేతుల మీదుగా లాంఛనం
సైబరాబాద్ – విశాల భారతి
పోలీస్ సిబ్బంది సంక్షేమమే పరమావధిగా సైబరాబాద్ కమిషనరేట్ వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన మహిళా, పురుష పోలీస్ బ్యారక్స్‌ను సీపీ డా. ఎం.రమేష్, రితిరాజ్‌తో కలిసి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ డా. ఎం.రమేష్ మాట్లాడుతూ.. 24 గంటలు ప్రజల భద్రత కోసం శ్రమించే పోలీసులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే మెరుగైన వసతి సౌకర్యాలు తప్పనిసరి అన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, సిబ్బంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు.నూతన బ్యారక్స్‌లో సిబ్బందికి అవసరమైన పడకలు, ఆధునిక మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్, ఫ్యాన్లు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించామని అధికారులు తెలిపారు. విధులు ముగించుకుని వచ్చిన సిబ్బందికి ఇక సురక్షితంగా విశ్రాంతి తీసుకునే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. నూతన బ్యారక్స్ ప్రారంభంతో తమ సమస్య తీరిందని అల్లాపూర్ స్టేషన్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. సీపీ డా. ఎం.రమేష్ చొరవతోనే ఇది సాధ్యమైందంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ పి.నరేష్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
