ప్లాస్టిక్ వ్యర్థాలకు ‘రెండో జీవితం’
– హఫీజ్‌పేట్‌లో ఎన్‌ఎంజి సేవా ట్రస్ట్ వినూత్న చొరవ
– పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం
– డివిజన్ వ్యాప్తంగా మరో 50 ప్రాంతాలకు ప్రాజెక్టు విస్తరణ
సైబరాబాద్ – విశాల భారతి
ఆధునిక సమాజానికి ప్లాస్టిక్ పెద్ద శాపంగా మారింది. వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుండటంతో భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ పెరుగుతున్న మహమ్మారికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనే సంకల్పంతో హఫీజ్‌పేట్‌కు చెందిన ‘ఎన్‌ఎంజి సేవా ట్రస్ట్’ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ట్రస్ట్ చైర్మన్ దాత్రినాథ్ గౌడ్ ప్రత్యేక చొరవతో హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలో ప్లాస్టిక్ పెట్ బాటిళ్ల సేకరణ కోసం ప్రత్యేక ఇనుప కేజ్‌లను (పంజరాలను) ఏర్పాటు చేశారు.జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన కొత్తకుంట చెరువు పరిసరాలు, స్థానిక పార్కులు, వైన్ షాపులు, చౌరస్తాలలోని టీ స్టాళ్ల వద్ద ఇప్పటికే ఏడు ప్రత్యేక కేజ్‌లను అమర్చారు. ప్రజలు తాము వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లను ఇష్టానుసారంగా రోడ్లపై, డ్రైనేజీల్లో వేయకుండా ఈ కేజ్‌లలో వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా సేకరించిన బాటిళ్లను క్రమ పద్ధతిలో వేరు చేసి, శుభ్రపరిచిన అనంతరం రీసైక్లింగ్ (పునరుత్పాదన) పరిశ్రమలకు పంపించనున్నారు. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ అయి మళ్లీ కొత్త రూపంలోకి మారుతాయని, తద్వారా ప్లాస్టిక్‌కు ‘రెండో జీవితం’ లభించడంతో పాటు ప్రకృతి వనరుల వినియోగం తగ్గుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలదే కాదు.. అందరి బాధ్యత..
పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వాల విధి మాత్రమే కాదని, సమాజంలో బతుకుతున్న ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎన్‌ఎంజి సేవా ట్రస్ట్ చైర్మన్ దాత్రినాథ్ గౌడ్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా వేసే ప్రతి చిన్న అడుగు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాలనీలు, బస్తీలలోని స్వచ్ఛంద సంస్థలు, నివాసితుల సంక్షేమ సంఘాలు (ఆర్‌డబ్ల్యూఏ) ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేయాలని కోరితే, ట్రస్ట్ తరఫున ఉచితంగా ప్లాస్టిక్ సేకరణ కేజ్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ఏడు కేంద్రాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, త్వరలోనే హఫీజ్‌పేట్ డివిజన్ వ్యాప్తంగా మరో 50 ప్రాంతాలకు ఈ ప్రాజెక్టును విస్తరించడమే తమ తదుపరి లక్ష్యమని ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. కాలనీ వాసుల సమష్టి భాగస్వామ్యంతో హఫీజ్‌పేట్‌ను ప్లాస్టిక్ రహిత ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దడమే ఈ వినూత్న చొరవ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.
