ఓటర్ల జాబితా సవరణ పక్కాగా జరగాలి
– గడువులోగా సీఐఆర్ పనులు పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశం
సైబరాబాద్ – విశాల భారతి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సీఐఆర్) కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎన్నికల నమోదు అధికారి నారాయణ్ అమిత్‌లతో కలిసి ఆయన గుల్మోహర్ కాలనీ, మైహోమ్ మంగళ అపార్ట్‌మెంట్‌లను సందర్శించి ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులతో మాట్లాడిన సుదర్శన్ రెడ్డి ఓటర్ల గణన, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపునకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ తీరును అడిగి తెలుసుకున్నారు.అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని, బూత్ స్థాయి అధికారులు, పర్యవేక్షకులు, నోడల్ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా నుంచి అర్హులెవరూ తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచి ఎక్కువ మంది ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ సేవా ఇస్లావత్, సహాయ ఎన్నికల నమోదు అధికారి ప్రేమ్ కుమార్‌తో పాటు బూత్ స్థాయి అధికారులు, పర్యవేక్షకులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
