కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను పాతరేస్తున్నారా..?
– శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ.. ప్రభుత్వంపై మండిపాటు
సైబరాబాద్ – విశాల భారతి
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం చందానగర్, హఫీజ్‌పేట్ డివిజన్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణారావు దిశానిర్దేశంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో పీజేఆర్ స్టేడియం నుంచి ఎన్‌హెచ్-65 ముంబై జాతీయ రహదారి వరకు ర్యాలీ సాగింది. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందంటూ నాయకులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్ష రూపాయలకు పైగా అందిన ఆర్థిక సాయం కొనసాగించాలని డిమాండ్ చేశారు.“కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగాలి.. పేదింటి ఆడబిడ్డ గెలవాలి” అంటూ నినాదాలు చేశారు. పథకాలను వెంటనే పునరుద్ధరించకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. మాజీ కార్పొరేటర్లు రంగా రావు, మిద్దెల మల్లారెడ్డి, పారునంది శ్రీకాంత్, రామకృష్ణ గౌడ్, కార్తిక్ రాయల, పొట్ట నరేందర్ యాదవ్, విజయ్‌రెడ్డి, అల్లాఉద్దీన్, జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
