జ్వరంతో వచ్చిన మహిళ మృతి
– జాయ్ ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
– వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
రాజేంద్రనగర్ – విశాల భారతి
అత్తాపూర్‌లోని జాయ్ హాస్పిటల్‌లో 28 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మంగళవారం ఉదయం ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబ సభ్యురాలు మృతిచెందిందని ఆరోపిస్తూ శ్రీలత కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
అత్తాపూర్ పరిధిలో నివాసముండే శ్రీలతకు సోమవారం నుంచి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జాయ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తామని చెప్పడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. రాత్రి సమయంలో శ్రీలత ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఐసీయూకు తరలిస్తున్నామని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం.
అయితే కొద్దిసేపటికే శ్రీలత మృతిచెందినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన శ్రీలతకు సకాలంలో సరైన వైద్యం అందించలేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు జాయ్ హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న బంధువులతో మాట్లాడారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.శ్రీలత మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి అసలు కారణం, వైద్యుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే విషయాలు పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం తేలనున్నాయి.
