పోలీసులకు ఆర్థిక నిర్వహణపై అవగాహన సదస్సు
– స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, పొదుపు, పెట్టుబడులపై సూచనలు
– సైబర్ మోసాల బారిన పడొద్దన్న నిపుణులు
సైబరాబాద్ – విశాల భారతి
కూకట్‌పల్లిలో పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక నిర్వహణపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాలానగర్ డీసీపీ రితీరాజ్ సూచన మేరకు కూకట్‌పల్లి సీఐ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ నర్సింహారెడ్డి, ఆర్థిక నిపుణుడు శ్రీధర్ రావు పాల్గొన్నారు.పోలీసు సిబ్బందికి స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక మోసాల నివారణపై వారు అవగాహన కల్పించారు. జీతంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పొదుపు చేయాలని, అనవసర అప్పులు, అధిక వడ్డీలకు ఆశపడి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఓటీపీలు, బ్యాంకు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరించారు. డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే బ్యాంకు లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.ఈ సదస్సులో బాలానగర్ డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
