ప్రజావాణిలో బాధితుడిపై సిటీ ప్లానర్ దురుసు వ్యాఖ్యలు
– డీసీ ముందే ఫిర్యాదుదారుడిని అవమానించిన వైనం
– అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే ఇదేనా స్పందన బాధితుడి ఆవేదన.!
సైబరాబాద్ – విశాల భారతి
ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన ప్రజావాణి వేదికలోనే ఓ ఫిర్యాదుదారుడికి చేదు అనుభవం ఎదురైంది. మియాపూర్ సర్కిల్-48 అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుష్మా యాదవ్ తనపై దురుసుగా మాట్లాడారని బాధితుడు ఆరోపించాడు. ‘‘సెటిల్మెంట్ కోసం వచ్చావా?’’ అంటూ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాడు. డిప్యూటీ కమిషనర్ సమక్షంలోనే ఈ వ్యవహారం జరగడంతో ప్రజావాణిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సోమవారం మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా మదీనాగూడ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్‌లో ప్లాట్ నంబర్ 63లో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. జీ ప్లస్3 నిర్మాణానికి మాత్రమే అనుమతులు తీసుకుని, అదనంగా మరో మూడు అంతస్తులను అక్రమంగా నిర్మించారని ఫిర్యాదుదారుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు.
తన ఇంటి ముందు జరుగుతున్న ఈ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు డీసీకి వివరించేందుకు ప్రయత్నించాడు. అయితే పక్కనే ఉన్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుష్మా యాదవ్ సీటు నుంచి లేచి వచ్చి ఫిర్యాదుదారుడిపై తీవ్రంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘‘వీళ్లంతా సెటిల్మెంట్ కోసమే వస్తారు.. సమస్యలు పట్టవు.. ఇలాంటి భవనాలకు నోటీసులు ఇవ్వడం దండగ’’ అంటూ డీసీ ముందే వ్యాఖ్యలు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
ప్రజల సమస్యలు వినాల్సిన అధికారే ఫిర్యాదుదారుడిని ఈ విధంగా కించపరిచేలా మాట్లాడటంపై అక్కడున్నవారు విస్మయం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణంపై చర్యలు కోరుతూ ప్రజావాణికి వచ్చిన వ్యక్తినే అనుమానించడం, పైగా దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు తలెత్తాయి. ప్రజావాణి అంటే ప్రజలకు భరోసా కల్పించే వేదికా.. లేక ఫిర్యాదుదారులనే ప్రశ్నించే వేదికా అని స్థానికులు నిలదీస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై గతంలో పత్రికల్లో పలుమార్లు కథనాలు వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కిల్-48 పరిధిలో అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి. జీ ప్లస్3కి అనుమతి ఉండగా అదనంగా మూడు అంతస్తులు నిర్మించారన్న ఫిర్యాదు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు అంటున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం వహిస్తే నిబంధనలు ఉల్లంఘించేవారికి మరింత ధైర్యం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజావాణిలో ప్రజల గోడు వినాల్సిన అధికారులు ఫిర్యాదుదారులపైనే విరుచుకుపడటం అధికార యంత్రాంగం పనితీరుపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులను పక్కనపెట్టి ‘‘సెటిల్మెంట్’’ వంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంది.
