మియాపూర్ హత్యకేసులో పోలీసుల తీరుపై విమర్శలు
– ఏడాదిగా మిస్సింగ్ కేసు.. ఇప్పుడు హత్య అని తేల్చారు
సైబరాబాద్ – విశాల భారతి
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టిన ఘటన మియాపూర్‌లో ఏడాది తర్వాత వెలుగుచూసింది. భర్త కనిపించడం లేదంటూ గత ఏడాది నవంబర్‌లో భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మియాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి వదిలేశారు. ఏడాదిగా సరైన దర్యాప్తు చేయకపోవడంతో అసలు నిజం బయటకు రాలేదు.ఇటీవల అనుమానంతో భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా హత్య కోణం బయటపడింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దుకు తరలించి పూడ్చిపెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. స్థానిక పోలీసుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఏడాది క్రితం ఫిర్యాదు అందినప్పుడే లోతుగా దర్యాప్తు చేసి ఉంటే నిందితులు అప్పుడే పట్టుబడేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఐ లేక ఇన్‌చార్జ్‌తో నడుస్తున్న మియాపూర్ పీఎస్‌లో కేసుల దర్యాప్తు కుంటుపడుతోందని, పోలీసుల నిర్లక్ష్య ధోరణి వల్లే హత్య కేసు ఏడాది పాటు మిస్సింగ్‌గానే మిగిలిందని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. సత్వర దర్యాప్తు లేకపోవడంతోనే సాక్ష్యాలు చెరిగిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
